Tuesday, March 15, 2016

స్వీయ ప్రోత్సాహం

చుట్టూ అందరూ ఉన్నా ఒక్కోసారి మనసు చెప్పుకునేందుకు, చెప్పినా అర్థం చేస్కునేందుకు ఎవరూ ఉండరు. ఇలాంటి సమయాల్లో కలత మనిషిని నిలువెల్లా కృంగదీస్తుంది. అటువంటప్పుడే అత్యంత అవసరమైనది, "స్వీయ విశ్వాసం - స్వీయ ప్రోత్సాహం(ప్రేరణ)". ఒంటరిగా సమయం లభించినప్పుడు మనిషి తనను గురించి తాను ఒక అవగాహనకు రావాలి. తనను తాను అభినందించుకోవాలి. తనను తాను విశ్వసించటం నేర్చుకోవాలి. అప్పుడు చుట్టూ ఎవరూ తనతో లేకపోయినా తనకు తాను ఉన్నాననే నమ్మకం ధృఢమవుతుంది. అప్పుడు జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఆ నలుగురే చుట్టూ చేరతారు, కుశల ప్రశ్నలు వేస్తారు. ప్రపంచం తీరు ఇదే! కాబట్టి భయపడవద్దు, బాధపడవద్దు. కేవలం మీ జీవిత గమనంలో సాగిపోండి! అవసరమైతే సాహసించండి!



Tuesday, August 18, 2015

|| ఓసారి చూడాలనుంది.. ||



తన మౌనం కొన్ని క్షణాలే..
తన చలనం ఎన్ని యుగాలో..!


తాను పలుకుతూ కళ్ళకు కలలనిస్తుంది..
తాను నవ్వుతూ పెదాలకి మాటలనిస్తుంది..
తాను శ్వాసిస్తూ మనిషికి ఆశలు రేపుతుంది..
తాను మరణిస్తూ గుండెకు కోతలు పెడుతుంది..


ఎక్కడుందో తెలియదు.. ఏ రూపమో తెలియదు..
ఎప్పుడూ చూడలేదు.. కనిపించే అవకాశమే లేదు..
అయినా తనంటే పిచ్చి..!
నవ్వుతూ నవ్వించినా.. ఏడుస్తూ ఏడిపించినా..
కన్నీరెంత కురిపించినా.. ఇంకా తనంటే పిచ్చే..! 


కనిపించని తనకు.. కనిపించే మనకు
ఏ బంధముందో తెలియకున్నా..,
తాను లేని జీవితం జీవచ్ఛవమేనన్న
నిజమొక్కటి తేలిందిగా.. ఇక..,  
కనిపించని దేవుడు కనిపిస్తే కోరేదొక్కటే..
తనని చూపించమని.., ఆ కనిపించని
"మనసు"నోసారి చూడాలనుందని.....!!  
 

 



Friday, July 17, 2015

ఓ మనసా..! ఎందుకే నీకీ ఉరకలు..?


ఓ మనసా..! ఎందుకే నీకీ ఉరకలు..?  

ప్రేమ ఎన్నడూ నీ తోడుండలేదని తెలిసీ..,

ఆ ప్రేమకై నిరీక్షణలోనే జీవితాన్ని గడిపేస్తావు!

జీవితం ఏనాటికైనా ఒంటరిదే అని తెలిసీ..,

కలకాలం జంటగా బ్రతకాలని కలలు కంటావు!

కల చెదిరి నీ హృదయం పగిలి మళ్ళీ రోదిస్తావు! 

గతాన్ని గతించనీయవు.. భవిష్యత్తుని స్వీకరించవు..

ఒక్క క్షణానికైనా ఆగి ఈ క్షణాన్ని ఆస్వాదించవు.. 

తెలిసి తెలిసీ అంధకారాన్నే వెంట తెచ్చుకుంటావు!

పిలిచి మరీ ఈ ప్రపంచానికి లొంగిపోతావు!

ఏమే పిచ్చి మనసా..! ఓసారి చూసుకో నిన్ను నువ్వు!

ఒక్క క్షణమాగి ఆలోచించుకో! ఏది నిజం? ఏది అబద్ధం?

భ్రమల్లో భయాల్లో జీవించటమూ ఒక జీవితమేనా?

చేతనైతే నిజంలో జీవించు.. 

అనుకున్నది సాధించు.. లేదా పూర్తిగా త్యజించు.. 

అంతేకానీ, నిత్యం మరణిస్తూ జీవించకు! తేల్చుకో ఇక!!


  

  

Saturday, April 18, 2015

|| ఎన్నాళ్ళు ||


ఎన్నాళ్ళు నిలుస్తాయి..?
చీడ వ్యక్తిత్వాన్ని కప్పెట్టిన అత్తర్ల ముఖాలు..!
ఏదో ఒకనాటికి అత్తరు పలచబడదా?


ఎన్నాళ్ళు సాగుతాయి..?
తుచ్ఛ రాజకీయాల మాటున నడిపే అక్రమాలు..!
ఏదో ఒకనాటికి ఆ క్రమం బయటపడదా?


ఎన్నాళ్ళు మెరుస్తాయి..?
కపట హృదయాలకు తళుకులద్ది మెరిసే పలుకులు..!
ఏదో ఒకనాటికి ఆ తీపివిషం క్షయమైపోదా?

ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళు?
రాక్షస కంసుడైనా రాజు రావణుడైనా
పెట్రేగిన తత్వంలో నశించలేదా ఆనాడు?
రావణకంసుని మించినోళ్ళా వీళ్ళు?
కేవలమాత్రులైన మనుషులే ఈనాడు..
ఎన్నాళ్ళు దాగేరు నక్కి నక్కి..
ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా...
మంచిని మసిచేసే చెడుకి అంతమే రాసుంది!
అంతమే రాసుంది ఏదో ఓ ముహూర్తానికి!
పతనమే ఉంటుంది చెడు బాట పట్టినోడికి!!
మేలి ముసుగు తొలగి వినాశమే వరిస్తుంది చివరికి!!!


Friday, April 17, 2015

|| చెమ్మ ||


పుట్టగానే పలకరిస్తుంది ఏడుపులో..
ఆ చెమ్మ ఎంతానందమో కన్నవారికి!


ఎదుగుతుంటే పరిచయించుకుంటుంది ఆటల్లో..
ఆ చెమ్మ ఎన్నిదెబ్బలేస్తుందో బాల్యానికి!


మనసంటే చూపిస్తుంది కాంక్షల్లో..
ఆ చెమ్మ జ్ఞాపకాలెన్నో యవ్వనానికి!

పోరాటమంటే తెలియజేస్తుంది ఆశయాల్లో..
ఆ చెమ్మ నేర్పే పాఠాలెన్నో నడివయస్సుకి!

జీవితమంటే అర్థంచేయిస్తుంది చివరంచులో..
ఆ చెమ్మ అనుభవాలెన్నో వృద్ధాప్యానికి!


ఆనందాల్లో ఒకసారి., ఆవేదనల్లో మరోసారి.,
చెక్కిలిని తడిమే ప్రతి చెమ్మా అర్థమున్నదే!
మనిషి మనిషితో అనుబంధాన్ని పెనవెసుకుంటూ.,
ఆర్ద్రతల్లో గాఢతల్లో బ్రతికుండే ప్రతి చెమ్మా అందమైనదే!
కంటికి ఆభరణమై., మనసుకి ఉపశమనమై.,
మోముపై ముత్యంలా మెరిసే ప్రతిచెమ్మా విలువైనదే!


కన్నీటి చెమ్మను చులకచేయక.,
సంతోషాల చెమ్మను తలకెక్కించుకోక.,
చెమ్మచెమ్మకూ ఓ నేర్పుందని తెలుసుకో!
రాలుతున్న ప్రతిచెమ్మనూ జారనీయక దాచుకో!!
నీ హృదయపుష్పంలో చెమ్మకూ ఇంత చోటిచ్చి నిలుపుకో!!!